దేశం విడిచి వెళ్లిన దేవెగౌడ మనవడు .. ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అయితే శాసనసభ ఎన్నికల్లో ఎదురైన పరాభావానికి లోక్‌సభ ఎన్నికల్లో బదులు తీర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఒంటరిగా కాకుండా జేడీఎస్‌తో కలిసి బరిలో నిలిచింది. ఆ పార్టీ మద్ధతుతో తాము తిరిగి సత్తా చాటుతామని స్పష్టం చేసింది. ఇరు పార్టీల నేతలు ప్రచారంలో తలమునకలై వున్న వేళ కర్ణాటకలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
జేడీఎస్ అధినేత, దేవెగౌడ మనవడు హసన్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్ధి ప్రజ్వల్ రేవణ్ణ వివాదం చిక్కుకున్నారు. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న వీడియోలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అలర్ట్ అయిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
రాష్ట్ర మహిళా కమీషన్ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌ను వీడి విదేశాలకు పయనమయ్యారు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఆయన ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లారు. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ గురించి నెటిజన్లు ఇంటర్నెట్ను జల్లెడ పడుతున్నారు.
ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ :
- ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు
- దేవెగౌడ పెద్ద కుమారుడు , మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ.. భవాణీ రేవణ్ణల కొడుకే ప్రజ్వల్. ఆయన సోదరుడు సూరజ్ రేవణ్ణ ఎమ్మెల్సీగా వున్నారు.
- 2014లో బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ కుటుంబానికి పట్టున్న హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి ఎం మంజుపై విజయం సాధించారు.
- నవంబర్ 27, 2019లో జేడీఎస్ కర్ణాటక విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ప్రజ్వల్ నియమితులయ్యారు.
- 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ - జేడీఎస్ కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా హసన్ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇదే స్థానంలో పుట్టస్వామి గౌడ మనవడు 31 ఏళ్ల శ్రేయాస్ ఎం పటేల్‌ను కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రకటించింది.
- ప్రజ్వల్ రేవణ్ణ తనకు 40.85 కోట్ల ఆస్తులు వున్నట్లుగా ప్రకటించారు. 2019తో పోలిస్తే తన ఆస్తులు నాలుగు రెట్లు పెరిగాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.

Comments
Post a Comment